హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిఘా పెట్టారు. వారి భేటీ సమయంలో జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద వారు కాపు కాసి సమాచారం సేకరించే ప్రయత్నాలు చేశారు.

జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ బుధవారం లోటస్ పాండ్ లో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై వారిద్దరు చర్చలు జరిపారు. 

ఈ భేటీపై ఆరా తీయడానికి ఎపి పోలీసులు అరడజను మంది నిఘా అధికారులను మోహరింపజేశారు. వారిలో ఎపి నిఘా విభాగానికి చెందిన ఓ డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ తో పాటు నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వారు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. 

వారు నేతల వివరాలను, వాహనాల నెంబర్లను సేకరిస్తూ, లోటస్ పాండ్ కు వచ్చిపోయేవారి గురించి ఆరా తీస్తూ కనిపించారు.