స్కిల్ డెలప్మెంట్ కేసు.. లోకేష్ సన్నిహితుడు రాజేష్ అమెరికాకు జంప్ అయ్యారా..!!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అనుమతి తీసుకుని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని ఏపీ సీఐడీ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు మాత్రమే కాకుండా ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ డైవర్షన్ కేసుల్లో కూడా లోకేష్ పాత్రపై సీరియస్‌గా విచారణ జరుపుతున్నట్టుగా తెలిపింది.
అయితే ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా లోకేష్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అందుకే లోకేష్ ఢిల్లీలో ఉంటున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం తెరమీదకు వచ్చింది. మరోవైపు తాజాగా నారా లోకేష్ పీఏ కిలారు రాజేష్ చౌదరి దేశం నుంచి అమెరికాకు జంప్ అయినట్టుగా పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు ఇతర కేసులు కూడా తెరమీదకు రావడంతో.. రాజేష్‌ను నారా లోకేషే అండర్ గ్రౌండ్‌లోకి పంపినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో షెల్ కంపెనీల నిధులు చంద్రబాబుకు రాజేష్ మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. లోకేష్ ఆర్థిక వ్యవహారాలు అన్ని రాజేష్ చూసుకునేవారని, పీఏగా కూడా వ్యవహరించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక, ఈ కేసుకు సంబంధించి సీఐడీ రిమాండ్ రిపోర్టులో లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా చంద్రబాబుకు డబ్బులు అందినట్లు పేర్కొంది. చంద్రబాబు వద్ద గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీన్వాస్‌తో కిలారు రాజేష్‌ల ద్వారా ఆయన నిధులు స్వీకరించినట్టుగా సీఐడీ ఆరోపించారు. ఇక, ఐటీ నోటీసుల్లో కూడా రాజేష్ పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను శాఖ నుండి సాక్ష్యాధారాల సర్టిఫైడ్ కాపీలను పొందడానికి.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్‌కు ఒక లేఖ పంపించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజేష్ ఆచూకీ కోసం సీఐడీ వెతుకున్న సమయంలో.. ఆయన విదేశాలకు పారిపోయినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.