Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు ఊరట: స్కిల్ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు


టీడీపీ చీఫ్ చంద్రబాబుకు  ఊరట దక్కింది.  నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు  మంజూరు చేసింది. 

AP Skill development case:AP High Court Grants  interim Bail To Chandrababu naidu lns
Author
First Published Oct 31, 2023, 10:44 AM IST | Last Updated Oct 31, 2023, 12:05 PM IST


అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడికి  మధ్యంతర బెయిల్ లభించింది.  ఈ విషయమై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించింది.చంద్రబాబు తనకు ఇష్టమైన  ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చని  ఏపీ హైకోర్టు సూచించింది.  

ఇంటికి,ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాలని ఏపీ హైకోర్టు  షరతు విధించింది.  ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని కూడ సూచించింది.  మరో వైపు  స్కిల్ కేసుకు సంబంధించిన సాక్షులను  ప్రభావితం చేయవద్దని  కూడ  ఆదేశించింది.  చంద్రబాబు ఎలాంటి చికిత్స తీసుకున్నారో  రాజమండ్రి జైలు సూపరింటెండ్ తో  పాటు తమకు  నివేదికను  ఇవ్వాలని  హైకోర్టు సూచించింది.అంతేకాదు  రూ. లక్ష చొప్పున ష్యూరిటీ కూడ ఇవ్వాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

నాలుగు వారాలపాటు చంద్రబాబుకు బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.చంద్రబాబునాయుడుకు అనారోగ్య కారణాలతో  ఏపీ హైకోర్టు  మధ్యంతర బెయిల్ ఇచ్చింది.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారు. ఈ ఏడాది నవంబర్  28న లొంగిపోవాలని  చంద్రబాబును  కోర్టు ఆదేశించింది. 

ప్రధాన బెయిల్ పిటిషన్ పై  ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన  ఏపీ హైకోర్టు విచారించనుంది.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.  ఈ కేసులో అరెస్టైన  చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.  రేపటితో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్  పూర్తి కానుంది.  అయితే  ఇవాళ చంద్రబాబుకు  ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు తరపు న్యాయవాదులు రాజమండ్రి  జైలు అధికారులకు  అందించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తైతే  చంద్రబాబు జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. 

చంద్రబాబునాయుడుకు మధ్యంతర బెయిల్  ఇవ్వాలని కోరుతూ ఈ నెల  27న ఏపీ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే  ఈ పిటిషన్ పై విచారణ నుండి హైకోర్టు జడ్జి జ్యోతిర్మయి తప్పుకున్నారు.  దీంతో ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల  30వ తేదీకి వాయిదా పడింది.  ఈ పిటిషన్ పై  ఈ నెల  30న ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. చంద్రబాబు  ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో  మధ్యంతర బెయిల్ ఇవ్వాలని  ఆయన తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా  వాదించారు.  

also read:ఏపీ స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్‌ కోసం బాబు పిటిషన్: తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

ఈ కేసులో అరెస్టైన  చంద్రబాబునాయుడు  ఇప్పటికే  50 రోజులకు పైగా జైలులో ఉన్న  విషయాన్ని లూథ్రా గుర్తు చేశారు.  అయితే  చంద్రబాబుకు  అన్ని రకాల వైద్య పరీక్షలను  ప్రభుత్వ వైద్యులు చేస్తున్నారని  ఏపీ సీఐడీ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  నిన్న ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత  తీర్పును  ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ ఉదయం  పదిన్నర గంటల సమయంలో  ఈ పిటిషన్ పై  ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించింది.  

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ  సుప్రీంకోర్టులో చంద్రబాబు  స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  నవంబర్ 8 లేదా 9 తేదీల్లో సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.  ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదలను  సుప్రీంకోర్టు ధర్మాసనం విన్నది.  తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios