విశాఖపట్నంలో శనివారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన మూడు రోజుల  పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో రూ. 4.39 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. దేశ, విదేశీ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్న  ఈ సదస్సులో 734 ఎంవోయులు కుదుర్చుకుంది. ఇదే విషయమై చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, 734 ఎంవోయుల ద్వారా రూ. 4,39,765 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. ఇవన్నీ సాకారమైతే 11 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చంద్రబాబు అన్నారు.

గతంలో విశాఖలో జరిగిన రెండు  సదస్సుల్లో జరిగిన ఎంవోయూల పరిస్థితిని, కోర్‌ డాష్‌ బోర్డు పనితీరును చంద్రబాబు సీఐఐ సదస్సులో వివరించారు. ప్రభుత్వ విశ్వసనీయతను తెలియజేయటానికే ఈ వివరణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఒకసారి పెట్టుబడిపెడితే ప్రభుత్వంలో భాగస్వామి అయినట్టేనని అన్నారు. పారదర్శకత, విశ్వసనీయతతో పనిచేస్తామని, ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రాకర్‌ ద్వారా దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చునని ఆయన అన్నారు.

ఏమైనా సమస్య ఉంటే 1100కు ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందన వస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకోవటం ద్వారా పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మూడేళ్ల క్రితం ఏపీలో తయారీరంగం బలహీనంగా ఉండేదని, ఇప్పుడు పుంజుకుందని చంద్రబాబు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి మారిందని ఆయన అన్నారు. కాగా సోమవారంతో సీఐఐ సదస్సు ముగుస్తోంది.