Asianet News TeluguAsianet News Telugu

ప్రవీణ్ ప్రకాశ్ టార్గెట్: ఆదిత్యానాథ్ దాస్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖ

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎస్ అదిత్యనాథ్ దాస్ కు మరో లేఖ రాశారు. సీఎంవోలోని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆయన సూచించారు.

AP SEC writes letter to Adityanath Das to remove Praveen Prakash from election process
Author
Amaravathi, First Published Jan 29, 2021, 11:38 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు మరో లేఖ రాశారు. ఈసారి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను లక్ష్యంగా ఎంచుకున్నారు.  ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించాలని సూచిస్తూ ఆయన ఆ లేఖ రాశారు.

ఈ నెల 23వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనకుండా ప్రవీణ్ ప్రకాష్ జిల్లా అధికారులను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రవీణ్ ప్రకాశ్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో మాట్లాడకుండా నిషేధం విధించాలని కూడా ఆయన సూచించారు. 

కొన్ని పత్రాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు ఉండడంపై ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించిన విషయం తెలిసిందే. ఆ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ కు లేఖ రాశారు.

కుల ధ్రువీకరణ పత్రాలపై, ఎన్ఓసీలపై వైఎస్ జగన్ ఫొటోలను తొలగించాలని ఆయన ఆ లేఖలో సూచించారు. ఈ విషయంపై జాప్యం లేకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. 

ఆ విషయంపై తాహిసిల్దార్లకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదిత్యనాథ్ దాస్ కు సూచించారు. వాటిపై జగన్ ఫొటోలు ఉండడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీల జారీలో వివక్ష లేకుండా చూడాలని కూడా ఆయన సూచించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నేడు, రేపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల్లో పర్యటించనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios