ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిన ఈ వ్యవహారంలోకి ఇప్పుడు అధికారులు వచ్చి చేరారు.

ఇవాళ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని నిమ్మగడ్డతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వేచి చూసినా ఫలితం లేకపోయింది.

Also Read:నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో భేటీ: షాక్ ఇచ్చిన అధికారులు

ఈ నేపథ్యంలో, తమకు ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకరించడంలేదని ఎస్ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు, ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే ఎన్నికల సంఘానికి సహకరించేది లేదని ప్రభుత్వ ఉద్యోగులు బహిష్కరాణాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఎన్నికలు ఆపాలని ప్రభుత్వం కోరడం సహేతుకంగా లేదని ఎస్ఈసీ వ్యాఖ్యానించారు. ఎస్ఈసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. తమ శవాల మీదుగా నడిచి వెళ్లి ఎన్నికలు పెడతారా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు బాయ్‌కాట్ చేస్తామని... అవసరమైతే సమ్మెకూ సిద్ధమని ప్రకటించాయి.