అమరావతి: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంతో నిత్యం తగువు పడుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మాత్రం ఆకాశానికెత్తారు. వైఎస్సార్ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని ఆయన చెప్పారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఆయన శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎస్బీ, కలెక్టర్లతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం ఉండేదని ఆయన అన్నారు. నిజాలను నిర్భయంగా చెప్పడానికి అవకాశం ఇచ్చేవారని ఆయన అన్నారు. తాను ఎవరివల్లనో ఎస్ఈసీని కాలేదని ఆయన చెప్పారు. ఏకగ్రీవాలపై ఆయన మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. 

Also Read: పంచాయతీ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద జగన్ సీరియస్, ప్లాన్ ఇదీ...

తాను ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదని, బలవంతపు ఏకగ్రీవాలు వద్దని మాత్రమే చెబుతున్నానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ తత్వం బాగుంటుందని ఆయన అన్నారు. బలవంతపు ఏకగ్రీవాలపై నిఘా ఉంటుందని ఆయన చెప్పారు. అసాధారణ ఏకగ్రీవాలు మంచిది కాదని ఆయన అన్నారు. ఏకగ్రీవాలపై షోడా షాడో బృందాలు దృష్టి పెడుతాయని ఆయన చెప్పారు. 

రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ సమన్యాయం చేయడం తన లక్ష్యమని ఆయన చెప్పారు. పనిచేసేవారిపై విమర్శలు వస్తుంటాయని ఆయన అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని ఆయన అన్నారు.

అంతకు ముందు టీడీపీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిశారు. గత పరిషత్ ఎన్నకిల సందర్భంగా జిల్లాలో చోటు చేసుకున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. మరోసారి అలా జరగకుండా చూడాలని వారు కోరారు. శుక్రవారం రాత్రి కడపకు చేరుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉదయం ఒంటిమిట్ట కోదండరాముడ్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆయన కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సమీక్ష నిర్వహించారు.