అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టుకు ఎక్కారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదం మరింతగా ముదురుతున్న నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గవర్నరతో తాను జరుపుతున్న ఉత్తరప్రత్యుత్తరాలు లీక్ కావడంపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

గవర్నర్ తో తాను జరుపుతున్న ఉత్తరప్రత్యుత్తరాలు ఎలా లీకవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై సీబిఐతో విచారణకు ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. తన పిటిషన్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను, మంత్రులు పెద్దిరెడ్డి రామంచ్దరారెడ్డి, బొత్స సత్యనారాయణలను ప్రతివాదులుగా చేర్చారు. 

తాను సెలవు పెట్టిన విషయం కూడా లీకైందని ఆయన చెప్పారు. తాను జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు సోషల్ మీడియాలో లీకవుతున్నాయని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ ఎన్నికల ప్రక్రియను కొనసాగించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా సెలవుపై వెళ్తారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. 

అదే సమయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉలంఘన నోటీసులపై ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. దానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమాధానం ఇచ్చారు.