గుంటూరు: పార్టీ రహితంగా జరిగే పంచాయితీ ఎన్నికల్లో మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు ఏవిధంగా అభ్యర్థులను, ఓటర్లను బెదిరిస్తారు..? అని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. బలవంతపు ఏకగ్రీవాలను అధికారులు ఏవిధంగా ప్రోత్సహిస్తారు..? పంచాయితీలతో సంబంధం ఉండే పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఏవిధంగా పంచాయితీ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారు..? పంచాయితీ ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రతిరోజూ ఎస్ఈసిపై, అధికారులపై ఏవిధంగా వ్యాఖ్యలు చేస్తారు..? అంటూ యనమల నిలదీశారు.

''మంత్రులు కూడా పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే... ఒకవైపు నామినేషన్లు వేస్తుంటే, మరోవైపు బెదిరిస్తూ ప్రకటనలు ఎలా చేస్తారు..? ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు ఇంతకన్నా పరాకాష్ట ఏముంది..? మంత్రుల వ్యవహారశైలిపై ఈసి జోక్యానికి మీరే అవకాశం కల్పించారు. ఎన్నికల్లో ఈసినే సర్వాధికారిగా సుప్రీంకోర్టు చెప్పింది. సిఈసికి ఉన్న అధికారాలే ఎస్ఈసికి ఉంటాయని సుప్రీం స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగం చెప్పింది అదే, సుప్రీంకోర్టు అదే చెప్పింది'' అని పేర్కొన్నారు యనమల. 

''ఎవరు కోడ్ ఉల్లంఘించినా, మంత్రి అయినా, మామూలు కార్యకర్త అయినా చర్య తీసుకునే అధికారం ఈసిదే. ఈసి పరిధిలో ఉన్న అధికారులను మంత్రి పెద్దిరెడ్డి ఎలా బెదిరిస్తారు..? బలవంతపు ఏకగ్రీవాలను మంత్రులు ఎలా ప్రోత్సహిస్తారు...? ఏదోవిధంగా గెలవాలని, బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని ఎలా ఆదేశిస్తారు...? ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా..? సిఈసితో సమాన అధికారాలు ఉన్న ఎస్ఈసిని నిర్లక్ష్యం చేయడం కాదా..? ఈసి పదవీకాలం వచ్చేనెలతో ముగిసిపోతుంది, ఇప్పుడాయన మాట విన్న అధికారులపై అప్పుడు శిక్షలు తప్పవు, బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించడం కోడ్ ఉల్లంఘనే కాదు, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట'' అని మండిపడ్డారు.

read more   పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. గవర్నర్ ఉన్నాడన్న నమ్మకం కలిగించాలి... : వర్లరామయ్య

''సిఈసితో సమాన అధికారాలు గల ఈసి ఇచ్చిన కోడ్ ఉల్లంఘన సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘనే, రాజ్యాంగ ఉల్లంఘనే.. ఓటర్లను ప్రభావితం చేయడం, అధికారులను బెదిరించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే, రాజ్యాంగ ఉల్లంఘనే, సుప్రీంకోర్టు ఉల్లంఘనే'' అన్నారు.

''కేంద్ర బడ్జెట్ లో పేర్కొన్నట్లుగా గ్రామాలకు నరేగా నిధులు, ఆర్ధిక సంఘం నిధులు భారీగా, నేరుగా వస్తాయి. ఆ నిధులన్నీ పంచాయితీల అభివృద్దికి, గ్రామాల ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలి. జగన్ రెడ్డి సిఎం అయ్యాక ఈ 20నెలల్లో వచ్చిన నిధులు ఏమయ్యాయి..? గ్రామాలకు వచ్చిన నిధులు ఎవరు స్వాహా చేశారు...? వైసిపి మద్దతుదారులే గెలిస్తే భవిష్యత్తులో వచ్చేనిధులన్నీ వాళ్లే స్వాహా చేస్తారు. మొత్తం పంచాయితీ వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తారు. వ్యవస్థను కాపాడుకునే అవకాశం ఎన్నికల రూపంలో గ్రామాల ప్రజలకు వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి, పంచాయితీలను కాపాడుకోవాలి. వైసిపి మద్దతిచ్చే అభ్యర్ధులను ఓడించి  గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలి'' అని యనమల ప్రజలకు సూచించారు.