పంచాయితీ ఎన్నికలలో స్వల్ప మార్పులు చేసినట్లు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లా కలెక్టర్ల వినతి మేరకు ఎన్నికలు జరగాల్సిన పంచాయితీలలో మార్పులు చేసినట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది.

ప్రకాశం జిల్లాలో ఒంగోలు డివిజన్ లో 20 మండలాలకు గాను 15కు మాత్రమే తొలిదశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. మిగిలిన ఐదు మండలాలకు రెండవ దఫాలో ఎన్నికలు జరగనున్నాయి.  

పంగులూరు, కోరిశపాడు, ఎస్.మాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాలలో పంచాయితీలకి ఫిబ్రవరి 9కి బదులు 13వ తేదీన రెండవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం మండలానికి 3వ దఫాకు బదులుగా 2వ దఫాలోనే ఎన్నికలు నిర్వహించనుండగా.. ఏలూరు డివిజనులోని నాలుగు మండలాలకు నాల్గవ దఫా బదులుగా మూడవ దఫాలోనే ఎన్నికలు జరపనున్నారు.

చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం,టి.నర్సాపురం మండలాలలోని పంచాయితీలకి ఫిబ్రవరి 21 బదులుగా ఫిబ్రవరి 17న మూడవ విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో మిగిలిన మండలాలకు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం నాల్గవ దఫాలో ఎన్నికలు జరపనున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు : నామినేషన్ కు అర్హతలివే.

మరోవైపు నిమ్మగడ్డ రేపు, ఎల్లుండి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ సైతం విడుదలైంది.

శుక్రవారం ఉదయం 7.45 గంటలకు విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఆ జిల్లా అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తారు.   

ఆ తర్వాత మధ్యాహ్నం 3.30గంటలకు బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు కర్నూలు చేరుకుంటారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎల్లుండి కడప జిల్లా పర్యటనకు వెళ్లి ఆ జిల్లా అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించనున్నారు.