అమరావతి: ఎన్నికల నిర్వహణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ కు ఫిర్యాదు చేసింది.

గురువారం నాడు  రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  మంత్రి కొడాలి నానితో పాటు మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ ను గవర్నర్  దృష్టికి తీసుకెళ్లారు.ఈ విషయమై మంత్రులు మాట్లాడిన వీడియో కామెంట్స్  వీడియో క్లిప్పింగ్ లను అందించారు. 

ఎస్ఈసీపై విమర్శలు చేస్తున్న మంత్రులను కట్టడి చేయాలని గవర్నర్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు.

అధికారులను తమపైకి ఉసిగొల్పుతున్న మంత్రులను కట్టడి చేయాలని ఎస్ఈసీ గవర్నర్ ను కోరారు.

వీడియో కాన్ఫరెన్స్ రద్దు


స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఏపీ ఎస్ఈసీ భావించింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. కానీ వీడియో కాన్ఫరెన్స్ విషయమై ప్రభుత్వం నుండి ఎలాంటి  అనుమతి రాలేదు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు డీపీఓ, జిల్లా పరిషత్ సీఈఓలకు ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు.

ఇవాళ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించారు. కానీ ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంతో ఈ వీడియో కాన్ఫరెన్స్ ను ఏపీ ఎస్ఈసీ రద్దు చేసుకొంది.

నిన్న కూడ వీడియో కాన్ఫరెన్స్ ను ఏపీ ఎస్ఈసీ రద్దు చేసుకొన్న విషయం తెలిసిందే.