అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి జై కొట్టారు టీడీపీ నేత, ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయం అభినందనీయమన్నారు.  

ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఆంగ్ల భాష తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. ఆంగ్ల భాష వచ్చి ఉంటే ప్రపంచంలో రాణించవచ్చునని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ స్కూళల్లో ఇంగ్లీషు మీడియం సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం అని  కొనియాడారు. 

బడుగు బలహీన వర్గాలకు ఇంగ్లీషు మీడియం ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో అన్యాక్రాంతమైన ఎస్సీ ఎస్టీ భూములను తిరిగి ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  కారెం శివాజీ కోరారు.  

ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరూ జగన్ నిర్ణయాన్ని పొగిడింది లేదు, అంగీకరించిన వారు కూడా లేరు. తొలిసారిగా కారెం శివాజీ జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కారెం శివాజీ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ఇకపోతే కారెం శివాజీ తన పదవిని కాపాడుకునేందుకే జగన్ ను పొగిడారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్న కారెం శివాజీని ఆ పదవి నుంచి తొలగిస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తన కుర్చీ కాపాడుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకే నా ? పేద పిల్లలకు వద్దా..!: సీఎం జగన్

మీడియం రగడ: చంద్రబాబు, పవన్ లపై రోజా ఆగ్రహం