ప్రభుత్వ ఖజనా ఖాళీ అయిపోయింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారింది. వివిధ బిల్లులు దాదాపు రూ. 7 వేల కోట్ల మేరకు నిలిచిపోయాయి.

ప్రభుత్వ ఖజనా ఖాళీ అయిపోయింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారింది. వివిధ బిల్లులు దాదాపు రూ. 7 వేల కోట్ల మేరకు నిలిచిపోయాయి. డబ్బులు లేని కారణంగానే బిల్లుల చెల్లింపులన్నింటినీ నిలిపేసారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, వివిధ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాలు, ఇతర పథకాల్లో బాగంగా కడుతున్న భవంతులకు సంబంధించిన బిల్లులు కూడా నిలిపేసారు.

చివరకు సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు కూడా ఆర్ధికశాఖకు కష్టంగా మారిందంటేనే పరిస్ధితి అర్ధమవుతోంది. పరిస్ధితి ఇలాగే ఉంటే మరో రెండు నెలల తర్వాత జీతాలు, పెన్షన్ల చెల్లింపు కూడా కష్టమవుతుందేమో అని ఆందోళన వ్యక్తమవుతోంది.

నెలల తరబడి బిల్లులు చెల్లింపు కాకపోవటంతో కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు. ఉన్నతాధికారులు, మంత్రుల సిఫార్సులే కాదు చివరాఖరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సిపారసులు తీసుకెళ్ళినా ఆర్ధికశాఖ బిల్లుల చెల్లింపు సాధ్యం కాదని సిఫారసులను పక్కన పెట్టేస్తోంది. పరిస్ధితి చూస్తుంటే చాలా దయనీయంగా మారిపోయింది. ఇంతటి దుర్బర పరిస్ధితి గతంలో ఎన్నడూ లేదని ఆర్ధికశాఖ ఉన్నతాధికారులే చెబుతున్నారంటేనే పరిస్ధితి అర్ధమైపోతోంది.