న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో టీడీపీ విషప్రచారం చేసిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పులకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఎపి రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయని, ఆ మార్పులు తేవడానికి తమకు 3 నుంచి 6 నెలల సమయం చాలునని ఆయన అన్నారు. అందుకు తగిన ప్రణాళిక తమ వద్ద ఉందని చెప్పారు. 

చంద్రబాబు ప్రభుత్వాన్ని కాగ్ తప్పు పట్టిందని, ఎపిలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు చెప్పిందని, కాగ్ కు కేంద్రంతో గానీ ఏ పార్టీతో గానీ సంబంధం లేదని అన్నారు. అసెంబ్లీని టీడీపి ప్రచార వేదికగా మార్చారని అన్నారు. 

అక్రమాలు జరిగినందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారని అన్నారు. 2004లో ఎదుర్కున్న పరిస్థితినే టీడీపి 2019 ఎన్నికల్లో చవి చవిచూస్తుందని అన్నారు. తాను ఏ పార్టీకి ఓటు వేయాలని చెప్పలేదని, ఎపికి అన్యాయం చేసిన పార్టీని ఓడించాలని మాత్రమే చెప్పానని చంద్రబాబు అంటూనే తన నిర్ణయాన్ని వెల్లడించారని ఆయన అన్నారు. 

తమపై చంద్రబాబు ఏకపక్షంగా దుర్మార్గమైన దాడి చేశారని, ప్రజలే నిలదీసే విధంగా చంద్రబాబు ప్రజా కోర్టులో నిలబెడుతామని అన్నారు.