ఆంధ్రా పోలీసుల డ్రస్ మారింది. ఇప్పటి వరకు పోలీసులు అనగానే.. ఖాకీ చొక్కాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ.. ఇప్పుడు ఆంధ్రా  పోలీసులు ఆ ట్రెండ్ ని మార్చేశారు. తెలంగాణ మాదిరిగానే.. ఏపీలోనూ ప్రత్యేకంగా మహిళల రక్షణ కోసం.. షీ టీమ్ ని ఏర్పాటు చేశారు. శక్తి టీమ్ పేరిట 17మంది సభ్యులుగల బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆకతాయిల ఆటకట్టించేందుకు వీరు రంగంలోకి దిగారు.

వీరి కోసం ప్రత్యేకంగా కొత్త డ్రస్ డిజైన్ చేయించారు.అంతేకాదు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. మహిళా కానిస్టేబుళ్లకి ప్రత్యేకంగా సైకిళ్లు ఏర్పాటు చేశారు. విజయనగరంలో ఈ స్పెషల్ శక్తీ టీమ్ పహారా కాస్తూ ఉంటుందని ఏపీ పోలీసుశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాలతో విజయవాడ డీసీపీ (క్రైమ్) రాజకుమారి ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుళ్లతో శక్తి టీమ్ ఏర్పాటు చేశారు. వారికి బ్యాటరీతో నడిచే సైకిళ్లను అందించారు. విజయవాడ నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద వీరు పెట్రోలింగ్ చేస్తుంటారు. అలాగే, మరికొందరు మహిళా కానిస్టేబుళ్లు కారులో పహారా కాస్తుంటారు.