ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. కాగా.. చంద్రబాబు చేసిన ట్వీట్ పై పోలీసులు కూడా స్పందించడం గమనార్హం. అయితే.. చంద్రబాబు చేసిన ట్వీట్ నిజం కాదంటూ వారు కౌంట్ ఇచ్చారు.

అంతేకాదు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు చంద్రబాబు నాయుడు పోలీసులకు సహకరించాలని కోరింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దంటూ అభ్యర్థించింది. వివరాలు.. ట్విటర్‌లో ఓ ఫొటోను షేర్ చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఎంత భయానకంగా మారిందో దీనిని చూస్తే తెలుస్తుందని అన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయానికి కాపలాగా ఉన్న ఒక పోలీసుపై జరిగిన దారుణమైన దాడి చూస్తుంటే.. వైసీపీ గుండాలు ఎంత ధైర్యంగా దాడులకు తెగబడుతున్నారో తెలుస్తోందని విమర్శించారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు కూడా రక్షణ లేదని వ్యాఖ్యానించారు.

 

దీనిపై స్పందించిన ఏపీ పోలీసు శాఖ.. ఫ్యాక్ట్ చెక్ హ్యాష్ ట్యాగ్ పేరిట చంద్రబాబు ట్వీట్‌ను తప్పుబట్టింది. "గౌరవనీయులైన ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు మీరు చేసిన పోస్ట్ సరైనది కాదు. మరోసారి మీరు చేసిన ఆరోపణలు తప్పుగా ఉన్నాయి. అక్కడ వైసీపీ కార్యకర్తలు గాయపడిన పోలీసుకు సాయం అందించారు. పడిపోయిన అతన్ని లేపి గాయాలను పరిశీలించారు. ఇటువంటి తప్పుడు ప్రచారానికి, తప్పుడు వార్తలకు దూరంగా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇటువంటి చర్యలు అనవసరంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తాయి. పోలీసులను కూడా నిరుత్సహపరుస్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి మీరు దయచేసి పోలీసులకు సహకరించాలని అభ్యర్థిస్తున్నాం''అని పేర్కొంది.