రాజధాని తరలింపు దిశగా... ఏపీ హోంశాఖ కీలక నిర్ణయం
విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాలని పేర్కొంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ పాలనా అనుమతులు మంజూరు చేశారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నుండి తరలించాలన్న జగన్ సర్కార్ నిర్ణయంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుశాఖకు సంబంధించి విజయవాడలో రూ.13.80 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం తరలించేందుకు సిద్దమయ్యింది.
ఏపీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తొలుత విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందుకు అనుమతులూు కూడా మంజూరయ్యాయి. కానీ తాజాగా విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాలని పేర్కొంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ పాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని డీజీపీకి సూచించారు.
మూడు రాజధానులు అంశంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో... పరిపాలనా రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నానికి కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తరలించే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.