చైనాలోని షాంగైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం తిప్పబట్లపల్లికి చెందిన కోలాటి తిప్పన్న, వెంగమ్మ దంపతుల కుమారుడు కిశోర్ ఉపాధి నిమిత్తం చైనా వలస వెళ్లాడు.

షాంగైలోని రెస్టారెంట్లో పనిచేస్తున్న కిశోర్ నిన్న విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా.. అతను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కిశోర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అతని మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కిశోర్ భౌతిక కాయాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.