తిరుమల: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రదాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తిరుమలకు చేరుకుని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున వీఐపి దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. 

తిరుమల కొండపైకి చేరుకున్న ఎస్ఈసీని టిటిడి అధికారులు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన నిమ్మగడ్డ మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎస్ఈసీ వెల్లడించారు. 

read more  ఈ-వాచ్ యాప్‌పై జగన్ సర్కార్ పిటిషన్: విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు

అంతకుముందు బుధవారం నిమ్మగడ్డ అమరావతిలో ఆయన ఈ-వాచ్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోటీ చేసి ఆత్మవిశ్వాసంతో  ఆ పొజిషన్ ను చేజిక్కుంచుకొనే నాయకత్వ లక్షణాలు ఈ వ్యవస్థకు కావాలన్నారు. అసాధారణ ఏకగ్రీవాలపై దృష్టి పెడతామని ఆయన చెప్పారు.  

రాష్ట్రంలో ఏకగ్రీవాలపై  విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  అధికార పార్టీ నేతలు అధికారాన్ని ఉపయోగించుకొని ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు జరగకుండా  ఏకగ్రీవంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకొన్న గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది.

 ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించుకొని విపక్షాల అభ్యర్ధులను పోటీలో లేకుండా చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.చిత్తూరు జిల్లాలో ఏకపక్షంగా ఏకగ్రీవాలు జరిగిన విషయమై చంద్రబాబునాయుడు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. బీజేపీ నేత సోము వీర్రాజు కూడ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.విపక్షాల విమర్శల నేపథ్యంలో ఏపీ ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.