ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల అభ్యర్థనలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. నిమ్మగడ్డ మొండిగా ముందుకు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీవోల సంఘం, ఉద్యోగుల సంఘాలు మండిపడుతున్నాయి.   

ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి ఎన్నికలను బహిష్కరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ క్షేమంగా ఉండాలి.. ఉద్యోగులు మాత్రం ప్రాణాలు బలి పెట్టాలా. అధికారులపై చర్యలు తీసుకుంటామని.. నిమ్మగడ్డ బెదిరించడం న్యాయం కాదు.  సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశాం. అద్దం చాటున దాక్కుని నిమ్మగడ్డ ప్రెస్ ‌మీట్‌ పెట్టారు’’ అని చంద్రశేఖర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

‘‘ఆయన ఎందరిపై చర్యలు తీసుకుంటారో చూస్తాం. నిమ్మగడ్డ వ్యవహించిన తీరు, మాట్లాడిన విధానం.. బాధ కలిగించింది. ఎలాగైనా ఎన్నికలు జరిపి తీరుతామనే నిమ్మగడ్డ మొండివైఖరి సరికాదు. మా ప్రాణాలకు ష్యూరిటీ ఎవరు ఇస్తారు. నిమ్మగడ్డ గ్యారెంటీ ఇస్తారా. 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఒకే తాటిపై ఉన్నాం. ఉద్యోగులను భయపెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నారు. మమ్మల్ని భయపెట్టి చంపే అధికారం మీకు లేదు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడం’’ అని చంద్రశేఖర్‌ రెడ్డి హెచ్చరించారు. 

నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంపై ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మండిపడ్డారు. 'సంఘాలుగా ఏర్పడింది నిమ్మగడ్డకు భజన చేసేందుకు కాదు.. ఉద్యోగుల హక్కుల కాపాడేందుకే ఏర్పడ్డాయి. ప్రభుత్వం చెబుతున్న వాదనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదో అర్థం కావడం లేదు. 

భయభ్రాంతులకు గురిచేసి ఉద్యోగులతో పనిచేయించలేరు. నిమ్మగడ్డ హెచ్చరికలకు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు.. ఉద్యోగులకు అండగా మేముంటాం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దురుద్దేశంతోనే నిమ్మగడ్డ ఉన్నారు. రాజ్యాంగం నిమ్మగడ్డ ఒక్కరికే కాదు. ప్రతి పౌరుడికీ రాజ్యాంగ హక్కు ఉంది. ఉద్యోగుల పట్ల బెదిరింపు ధోరణి కుదరదు. బెదిరించే తత్త్వాన్ని తాము ఎంత మాత్రం అంగీకరించం' అంటూ వెల్లడించారు.