కడప: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైసీపీ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అక్రమంగా ఇసుక తరలిస్తే రెండేళ్లు జైలు శిక్ష విధించేలా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఏపీ కేబినెట్ నిర్ణయంతో పోలీసులు ఇసుక అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపారు. అయితే ఇసుక అక్రమ రవాణా కేసులో తొలి శిక్ష అమలైంది. అది కూడా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కావడం మరో విశేషం. 

ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2 లక్షలు జరిమానా: ఏపీ కేబినెట్ నిర్ణయం

వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజు పల్లె గ్రామంలో ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు అయ్యింది. విచారణ చేపట్టిన కడప మెజిస్ట్రేట్ నిందితులకు మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 

ఏపీలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించాలని అవసరమైతే రూ.2లక్షలు వరకు జరిమానా విధించాలంటూ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే.  

రాష్ట్రం నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతుందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు విపక్షాలు అన్నీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించడానికి కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది జగన్ సర్కార్.  

అనంతరం ఏపీలో ఇసుక కొరతను నివారించేందుకు జగన్ ప్రభుత్వం ఇసుక వారోత్సవాలను నిర్వహించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని ఇప్పటికే ఇసుక అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

ఇసుక అక్రమాలపై నిరంతర నిఘా.. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన కొద్ది రోజులకే కేసు నమోదు కావడం శిక్ష కూడా ఖరారు కావడం గమనార్హం. అయితే ఈకేసులో తొలి శిక్ష జగన్ సొంత జిల్లా అయిన కడపలో చోటు చేసుకోవడం విశేషం.