విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ప్రశంసలు జల్లు కురిపించారు ఏపీ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్. గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన వేదికపై జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 

ఇప్పటి వరకు వైయస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఉన్న వారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు పొందినవారంతా జగన్ ను రోజూ పూజించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడి బిడ్డ కాబట్టే దేవుడిలా జగన్ ఉద్యోగాలు ఇచ్చారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. 

దేశానికి స్వర్ణయుగం గుప్తుల కాలమైతే ఏపీకి ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందంటూ తెగ పొగిడేశారు. అధికారం చివరి రోజుల్లో మేనిఫెస్టోను అమలు చేసే ప్రభుత్వాలనే చూశామని కానీ సీఎం జగన్ అందుకు విరుద్ధంగా మెుదట్లోనే అమలు చేసి రికార్డు సృష్టించారంటూ రాజకీయ పరమైన వ్యాఖ్యలు సైతం చేసేశారు. 

ఏపీలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందంటూ మున్సిపల్ శాఖ కమిషనర్ సర్టిఫికెట్ ఇవ్వడం రాజకీయ పరమైన కామెంట్లు సైతం చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల మేనిఫెస్టో గురించి కూడా ప్రస్తావించడంపై సభలో చర్చ జరిగింది.