అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం గుప్పించారు ఏపీ మంత్రి జయరాం. తాను మంత్రిగా ఉన్నానంటే దానికి కారణం సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డే కారణమంటూ స్టార్ట్ చేసిన మంత్రి అక్కడితో ఆగకుండా పొగడ్తలతో జోష్ నింపారు. 

అందరి రాత బ్రహ్మరాస్తాడని అంటారని అయితే బ్రహ్మ రాసాడో లేదో తెలియదు గానీ రాష్ట్ర మంత్రులుగా తమ రాత మాత్రం జగన్ రాశాడని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ అంటే తనకు ప్రేమ ఎక్కువ అని అందుకే ఆయనను అన్నా అంటూ గౌరవంగా పిలుచుకుంటానని చెప్పుకొచ్చారు.  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారని, ఆయా వర్గాలకు 5 ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించారని గుర్తు చేశారు. 2017లో పాదయాత్ర చేస్తుండగా వైఎస్‌ జగన్‌ను కలిశానని, మీరు మాపాలిట దైవసంకల్పమని ఆయనకు చెప్పానని గుర్తు చేశారు. 

తాను వాల్మీకి బోయ కులానికి చెందినవాడినని, తమ బోయ కులస్తులకు వైఎస్‌ జగన్‌ వాల్మీకి మహర్షి అంతటి వారని ప్రశంసించారు. సీఎం జగన్ ఎస్సీలకు అంబేద్కర్‌గా, ముస్లింలకు అల్లాగా, క్రైస్తవులకు జీసెస్‌గా అభివర్ణించారు. 

మంత్రి జయరాం పొగడ్తలతో ముంచెత్తుతుంటే సభలో నవ్వులు పూశాయి. సీఎం వైయస్ జగన్ తోపాటు ఎమ్మెల్యేలు సైతం పడిపడి మరీ నవ్వారు. అంతేకాదు రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఆ తర్వాత కులం, మతం, పార్టీలు చూడొద్దని తమ నేత జగన్ అన్నారని గుర్తు చేశారు.  

సబ్‌కా మాలిక్‌ ఏక్‌ హై అంటూ శిరిడీ సాయిబాబా పేర్కొనేరీతిలో వైఎస్‌ జగన్‌ కూడా సబ్‌ కా మాలిక్‌ అంటూ కొనియాడారు. ఇలా వరుసగా పొగడ్తలతో ముంచెత్తుతున్న జయరాంకు ఒకానొక సందర్భంలో అడ్డుకట్ట వేశారు స్పీకర్ తమ్మినేని సీతారం. ఇంతకీ మన బిల్ సంగతి చూడండి అంటూ సూచించారు. 

వైయస్ జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆరు బిల్లులపై ప్రసంగిస్తూనే మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు. నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా చంద్రబాబుకు జగన్ కి ఉందన్నారు. నక్క చంద్రబాబు అయితే నాగలోకం వైయస్ జగన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.  

మంత్రి గుమ్మనూరు జయరాం పొగడ్తలతో ముంచెత్తుతుండటంతో సీఎం జగన్ దండంపెట్టి ఆపన్నా అంటూ బతిమిలాడుకున్నారు. ఇక ఆపన్నా ఆపన్నా అంటూ బతిమిలాడినా మంత్రి మాత్రం ఆగలేదు. తన పొగడ్తల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉండటంతో సభలో మళ్లీ నవ్వులు వెలిశాయి.