గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అంతేకాదు తమ ప్రచారం పవర్ ఏంటో చంద్రబాబుకు చూపిస్తామంటూ సవాల్ విసిరారు. అందులో భాగంగా ఏపీలో పర్యటనకు అసదుద్దీన్ అండ్ టీం అస్త్రశస్త్రాలు రెడీ చేస్తోంది. 

అటు టీఆర్ఎస్ చీఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతామని చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు అసదుద్దీన్ ఓవైసీ, ఇటు సీఎం కేసీఆర్ ఆంధ్రపర్యటనలపై హింట్ లు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. 

ఏపీ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఎస్ఎం జియావుద్దీన్ ను రంగంలోకి దింపింది. గుంటూరు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడిని ఆయన నవ్యాంధ్రలోని ముస్లిం మైనార్టీల్లో విషం చిమ్ముతూ మత సామరస్యానికి విఘాతం కలిగించేలా పొరుగు రాష్ట్రంలోని కొన్నిశక్తులు ఏకమైవ్యూహాలు రచిస్తున్నారని మండిపడ్డారు. 

వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ లపై వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు సంబంధించిన అంశాల్లో శాంతి, భద్రత, అభివృద్ధి, సంక్షేమం నూటికి నూరు పాళ్ళు అమలు జరుగుతుందని స్పష్టం చేశారు.  

రాష్ట్ర విభజన అనంతరం నాలుగున్నరేళ్ల కాలంలో ఏనాడైనా ఆంధ్ర మైనారిటీల గురించి పొరుగు రాష్ట్రం నేతలు మాట్లాడారా చర్చించారా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరోజు ఆంధ్ర ముస్లిం మైనారిటీల గురించి పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 
 
ఆంధ్ర పార్టీ, ఢిల్లీ పార్టీ అంటూ చులకనచేసి మాట్లాడడం వారికి తగదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో హజ్‌హౌస్‌, మౌలానా ఆజాద్‌ ఉర్దూ యూనివర్సిటీ, మైనార్టీ కమిషన్‌ ఏర్పాటు ఆంధ్ర పాలకుల చలవేనన్నారు.

హైదరాబాద్‌లో విధ్వంసాలు సృష్టించి వారి స్వార్థానికి దశాబ్దాల కాలం పాటు మైనార్టీలను అడ్డు పెట్టుకుంటుంది ఎవరనేది ఎవరినడిగినా చెబుతారన్నారు. అక్కడ ముస్లిం మైనార్టీలు అనేక కేసుల్లో కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. 

ఆలేరు, బైంసా ఎన్‌కౌంటర్‌ సంఘటనల్లో ముస్లిం కుటుంబాలను ఇరికించింది ఏ ప్రభుత్వమో తెలుసునని చెప్పుకొచ్చారు. దేశంలో ఎవరు ఎక్కడైనా వెళ్ళి పోటీ చేయవచ్చని అయితే అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని జియావుద్దీన్ హితవు పలికారు.