అవిశ్వాసం: టీడీపీ ఎంపీలతో యనమల భేటీ, ప్లాన్ ఇదే

First Published 19, Jul 2018, 4:16 PM IST
Ap minister Yanamala Ramakrishnudu gives information to TDP MP's for no trust vote
Highlights

అవిశ్వాసం సందర్భంగా పార్లమెంట్‌లో  చర్చించాల్సిన అంశాలపై ఏపీ ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో  టీడీపీ ఎంపీలు గురువారం నాడు  న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

అమరావతి: అవిశ్వాసం సందర్భంగా పార్లమెంట్‌లో  చర్చించాల్సిన అంశాలపై ఏపీ ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో  టీడీపీ ఎంపీలు గురువారం నాడు  న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాణంపై  శుక్రవారం నాడు పార్లమెంట్‌లో చర్చ జరగనుంది. ఈ చర్చ సందర్భంగా  కేంద్రం తీరును ఎండగట్టాలని  చంద్రబాబునాయుడు  భావిస్తున్నారు. ఈ మేరకు సుమారు 18 అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని టీడీపీ భావిస్తోంది.

అయితే  ఇందులో 10 అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయాలని టీడీపీ తలపెట్టింది. అయితే  ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

ఏపీ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు, ఏపీ ఆర్ధికశాఖ మంత్రి  యనమల రామకృష్ణుడు హుటాహుటిన అమరావతి నుండి గురువారం నాడు  న్యూఢిల్లీకి చేరుకొన్నారు. అవిశ్వాసం సందర్భంగా చేపట్టాల్సిన  చర్చకు సంబంధించిన అంశాలపై  యనమల రామకృష్ణుడుతో  ఎంపీలు సమావేశమయ్యారు.

అవిశ్వాసం తీర్మాణం సందర్భంగా చర్చను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత  వచ్చే అవకాశం ప్రకారంగా ఎంపీలు కేశినేని నాని, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రసంగించాలని చంద్రబాబునాయుడు  పార్టీ ఎంపీలకు  సూచించారు.  ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌కు సమాచారాన్ని ఇచ్చారు.

మరోవైపు  కేంద్రం ఇప్పటివరకు  ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్రానికి  ఏ రకంగా అన్యాయం చేసిందనే విషయాలపై  పూర్తి సమాచారంతో  లోక్‌సభలో తమ వాదనను టీడీపీ విన్పించే అవకాశం ఉంది. 

బీజేపీపై ఎదురుదాడి లక్ష్యంగా చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. గల్లా జయదేవ్ రాజధాని నిర్మాణంపై చర్చించనున్నారు.  రామ్మోహన్ నాయుడు తన ప్రసంగంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులను  తిరిగి తీసుకోవడం వంటి అంశాలను ప్రస్తావించనున్నారు. మరోవైపు  విశాఖకు రైల్వే జోన్  విషయాలను కూడ ప్రస్తావించాలని  చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలను ఆదేశించారు.

మరో వైపు  ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి  ఇప్పటివరకు ఎంపీలకు పూర్తి సమాచారాన్ని అందింది. ఈ సమాచారాన్ని  పార్లమెంట్ వేదికగా చేసుకొని బీజేపీ తీరును ఎండగట్టేందుకు ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది టీడీపీ.
 

loader