విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక కోసం చంద్రబాబునాయుడు ఆలయాల అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాస్ విమర్శించారు. 

ఆదివారం నాడు రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాన్ని మరో మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి పరిశీలించిన తర్వాత ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.

అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలో చాలా ఆలయాలను దుర్మార్గంగా కూల్చివేశారని ఆయన గుర్తు చేశారు.దేవాలయాల భూములను బినామీలకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు.

రాజకీయ లబ్ది కోసం ఈ ఘటనను ఉపయోగించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతకు ముందు దేవాలయాలు కూల్చినప్పుడు ఆయనకు ఈ విషయాలు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు.

also read:కారుపై దాడి: చంద్రబాబు, అచ్చెన్నాయుడిపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబుకు ఇప్పుడు హిందూ సంప్రదాయాలు, ఆలయాలు గుర్తుకొచ్చాయా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేవాలయాలతో రాజకీయాలు చేయడం సరైంది కాదని మంత్రి అభిప్రాయడ్డారు. రామతీర్థం ఘటన దురదృష్టకరమైన ఘటనగా ఆయన  పేర్కొన్నారు.

రామతీర్థం ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉంటే కచ్చితంగా రాముడే ఆయనను శిక్షిస్తాడని మంత్రి వెల్లంపల్లి హెచ్చరించారు.దేవాలయాల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.