అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేంద్రప్రభుత్వం సమీక్షలు నిర్వహించొచ్చు, తెలంగాణ సీఎం సమీక్షలు జరపొచ్చు కానీ ఏపీ సీఎం మాత్రం సమీక్షలు జరపకూడదా ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి త్వరలోనే తాను వ్యవసాయ శాఖపై సమీక్షలు చేస్తానని స్పష్టం చేశారు. తన సమీక్షను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. 

మంత్రులుగా ఉంటూ సమీక్షలు చెయ్యకుండా ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఇంకెందుకని ప్రశ్నించారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆనం రాంనారాయణరెడ్డిపై విరుచుకుపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 

పూటకో పార్టీ మాట్లాడే ఆనం రాంనారాయణరెడ్డికి మతిమరుపు వ్యాధి వచ్చిందని విమర్శించారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ తెలియని ఆనం ఎలా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారో అని ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వం లేకుండా చెయ్యాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. 

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2004లో ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజీనామా చేసినా చంద్రబాబు నాయుడు కేర్ టేకర్ గా ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చారు. 

ప్రభుత్వం యథాతథంగా పనిచేస్తోందని ఈసీ చెప్పిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి గుర్తు లేదేమోనని సెటైర్లు వేశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.