నెల్లూరు: దివ్యాంగుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వెంకటాచలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని సోమిరెడ్డి ప్రారంభించారు. 

దివ్యాంగుల కోసం శిబిరాన్ని ఏర్పాటు చెయ్యాలని కేంద్రప్రభుత్వ సంస్థ అలెంకోని సంప్రదించిన వెంటనే అంగీకరించి మూడు రోజులపాటు క్యాంప్ నిర్వహించేందుకు వచ్చిందని అందుకు కృతజ్ఞతలు తెలిపారు. క్యాంప్ ను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

క్యాంప్ కు వచ్చే దివ్యాంగులకు అందరికీ భోజనం, తాగునీటి వసతిని కల్పించినట్లు తెలిపారు. దివ్యాంగులందరికీ నిపుణులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు అందజేస్తామని తెలిపారు. డిసెంబర్ 3న జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అన్ని పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. 

 నెల్లూరు జిల్లాలో 34,724 మంది దివ్యాంగులకు రూ.1,500 చొప్పున ప్రతి నెలా పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ అవయవాల కోసం గత ఏడాది రూ.13 కోట్లు, ఈ ఏడాది రూ.35 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. 2018-19లో దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం రూ.121 కోట్లు కేటాయించినట్లు సోమిరెడ్డి తెలిపారు.


పద్దెనిమిదేళ్లు నిండిన బధిరులకు స్మార్ట్ ఫోన్, డిగ్రీ, ఆ పై చదువులు చదివే వారికి ల్యాప్ టాప్ అందిస్తామని అలాగే అంధులకు బ్రెయిలీ లిపి పలకలు అందజేయనున్నట్లు తెలిపారు. మరోవైపు 50 ఏళ్ల లోపు దివ్యాంగులకు రూ.37 వేలు విలువైన బ్యాటరీ ట్రై సైకిల్ ను రూ.12 వేలకే పంపిణీ చేయనున్నట్లు మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు.