చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్ కౌర్ నియామకం విషయంలో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. అసలు చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభుత్వం ఎవరినీ నియమించనే లేదట. చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్రే స్వయంగా మంగళవారం ఈ ప్రకటన చేయటంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. నటిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటం వెనుక పవన్ కల్యాణ్ హస్తముందని సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అప్పటి నుండి పూనమ్ కేంద్రంగా అనేక వివాదాలు మొదలయ్యాయి.

ఇదే విషయమై తాజాగా మంత్రి సంచలన ప్రకటన చేశారు. తాను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని స్పష్టం చేశారు. అసలు ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదని ఆయన అన్నారు.

ప్రభుత్వ పరంగా అంబాసిడర్‌ను నియమించాలనే చర్చ జరగలేదని, కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయనను కలిసి కోరారని తెలిపారు. అంతే తప్ప చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.