మమ్మల్నిచంపాలనే ఉద్దేశ్యంతో విశాఖలో దాడి:జనసేనపై మంత్రి రోజా ఫైర్
పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన కార్యకర్తలు విశాఖలో తమపై దాడి చేశారని ఏపీ మంత్రి రోజా ఆరోపించారు.. తమను చంపాలనే ఉద్దేశ్యంతోనే దాడులు నిర్వహించారని మంత్రి చెప్పారు.
అమరావతి: పవన్ కళ్యాణ్ సైకో ఫ్యాన్స్ విశాఖ పట్టణంలో తమను చంపాలని చూశారని ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ఆరోపించారు .సోమవారంనాడు మంత్రి రోజా అమరావతిలో మీడియాతో మాట్లాడారు. విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో తమపైరాళ్లు,రాడ్లతో జనసేన కార్యకర్తలు దాడికి దిగారన్నారు. విశాఖలో గర్జనకు తాము హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలోనే రెచ్చగొట్టేందుకు పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించారని ఆమె ఆరోపించారు.
అమరావతి టీడీపీ రాజధాని అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారని ఆమె గుర్తు చేశారు.అంతేకాదు తన దృష్టిలో .కర్నూల్,విశాఖపట్టణం రాజధానులని పవన్ కళ్యాణ్ చెప్పాడన్నారు. ఏం ప్యాకేజీ తీసుకుని మాట మార్చారో చెప్పాలని పవన్ కళ్యాణ్ ను ఆమె డిమాండ్ చేశారు. మూడు రాజధానులను ఉత్తరాంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. ఈ విషయమై ప్రజల దృష్టిని మరల్చేందుకు వైజాగ్ లో తమపై దాడి చేశారన్నారు.
ఈ నెల 15న మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో జేఏసీ ఆధ్వర్యంలో విశాఖగర్జన నిర్వహించారు. ఈ గర్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్ లపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఆరోపించింది.అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన స్పష్టం చేసింది. ఈ ఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో వంద మందికి పైగా జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
alsoread:ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్దమైన పవన్ కల్యాణ్.. పోలీసుల వ్యవస్థ మీద పోరాటం కాదని వెల్లడి..
విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు ఈ నెల 15నే పవన్ కళ్యాణ్ విశాఖపట్టణానికి వచ్చారు. నిన్న పోర్టు స్టేడియం వద్ద జనవాణిని నిర్వహించాల్సి ఉంది. అయితే అరెస్టైన తమ పార్టీ క్యాడర్ విడుదలైన తర్వాతే జనవాణిని నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విశాఖలో ఉన్న పవన్ కళ్యాణ్ కు నిన్ననే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించ వద్దని కూడా కోరారు. ఇవాళ మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ విశాఖపట్టణం నుండి నేరుగా గన్నవరం విమనాశ్రయానికి వచ్చారు.