అమరావతి: ఏపీ అసెంబ్లీ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై మంత్రి పేర్నినాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడుని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారని నాని వ్యాఖ్యానించారు. 

అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న టెక్కలి ప్రజలు రోజూ ఇదేం గోల అంటూ బాధపడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈయమ్మ ఏంట్రాబాబు ఈ గోల అంటూ ఆవేదన చెందుతున్నారంటూ మంత్రి పేర్నినాని చెప్పుకొచ్చారు. పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.  

అయితే తన వ్యాఖ్యలు తప్పని తేలితే వెనక్కి తీసుకుంటానని పేర్ని నాని స్పష్టం చేశారు. అనంతరం సభలో ప్రసంగించిన అచ్చెన్నాయుడు తాను శాసనసభలో ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. 

మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సైతం మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై విరుచుకుపడ్డారు. సభా సంప్రదాయాలు మరిచిపోయారని విమర్శించారు. స్పీకర్‌ను కూడా బెదిరించేలా అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.