అమరావతి: గ్రామసచివాలయం ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎలాంటి అక్రమాలకు, అవినీతికి తావివ్వకుండా ఉద్యోగ ఎంపికప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. 

రూ.5లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తాం, రూ.10లక్షలు ఇస్తే క్వశ్చన్ పేపర్లు ఇస్తామంటూ దళారులు ప్రచారం చేస్తున్నారని వారిని నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని సూచించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వారి ప్రకటనలు, వారి ప్రలోభాలను నమ్మి మోసపోవద్దన్నారు. అభ్యర్థులను మోసం చేస్తున్న ఇద్దరు దళారులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. 

పరీక్షకు హాజరయ్యే ప్రతీ అభ్యర్థి వ్యక్తిగత గుర్తింపుకార్డు తీసుకుని హాజరుకావాలని సూచించారు. సెల్ ఫోన్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని చెప్పుకొచ్చారు. వికలాంగులకు 50 నిమిషాలు అదనంగా పరీక్ష సమయం కేటాయించనున్నట్లు తెలిపారు. పరీక్ష పూర్తైన రోజు సాయంత్రమే పేపర్లను నాగార్జున యూనివర్శిటీకి కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలిస్తామని తెలిపారు.