ఏ కష్టం వచ్చినా నాతో చెప్పండి : వైసీపీ నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఏ కష్టం వచ్చినా తనతో చెప్పుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 175కి 175 సీట్లు గెలవాలన్నదే జగన్ నినాదమని పెద్దిరెడ్డి తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లలేదన్నారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో జరిగిన వైసీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది అయినా, సమస్యలైనా తనతో చెప్పుకోవాలని నేతలకు సూచించారు. 175కి 175 సీట్లు గెలవాలన్నదే జగన్ నినాదమని పెద్దిరెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో గుంతకల్లులో అత్యధిక మెజారిటీ సాధించామని ఆయన గుర్తుచేశారు. 98.44 శాతం ఎన్నికల హామీలను నెరవేర్చామని... దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లలేదని రామచంద్రారెడ్డి అన్నారు.
కరోనా సమయంలోనూ ప్రజలకు ఏ కష్టం తెలియకుండా పాలన సాగించారని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ పేరు చెబితే ఆరోగ్యశ్రీ, జగన్ పేరు చెబితే నవరత్నాలు గుర్తొస్తాయని.. మరి చంద్రబాబు పేరు చెబితే ఏం గుర్తొస్తుందని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని ఎల్లో మీడియా తెగ ప్రయత్నిస్తోందని.. కానీ చంద్రబాబు సీఎం కాలేరని మంత్రి జోస్యం చెప్పారు.
ALso REad:ఈ నెల 14న గడప గడపకుపై జగన్ సమీక్ష.. సీఎంకు చేరిన ప్రొగ్రెస్ రిపోర్ట్, ఎమ్మెల్యేల్లో టెన్షన్
ఇకపోతే... వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని అందుకోవాలని భావిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా సిద్ధంగా వుండేలా శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నేతలతో సమావేశమైన ఆయన దిశానిర్దేశం చేశారు. తాజాగా .. ఈ నెల 14న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలకు సూచనలు ఇవ్వడంతో పాటు పరిశీలకులతో జరిగిన సమావేశం వివరాలను జగన్ వివరించనున్నారు.
ఇప్పటికే సీఎంకు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి నివేదికలు అందజేసింది ఐప్యాక్ టీమ్. నివేదికలో అంశాలు ఎమ్మెల్యేల పనితీరును వివరించనున్నారు సీఎం. బహుశా గడప గడపకుపై ఇదే చివరి సమీక్ష అయ్యే అవకాశం వుందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే సుమారు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.