చిత్తూరు: మరోసారి కుప్పానికి చంద్రబాబును రానివ్వకుండా చేస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. 

తిరుపతిలో మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు.కుప్పంలో వైసీపీకి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. చంద్రగిరిలో కూడ నూరు శాతం స్థానిక సంస్థలను వైసీపీ గెలుస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంచి అవకాశాలుంటాయన్నారు. 

సర్పంచ్ లు బాధ్యత తీసుకొని అభివృద్ది పథంలో గ్రామాలను నడిపించాలని ఆయన కోరారు.జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలనే తమ పార్టీ గెలుపునకు కారణంగా ఆయన పేర్కొన్నారు. 

40 ఏళ్ల రాజకీయ అనుభవం గల చంద్రబాబునాయుడు  కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పకూలిపోయాడన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ బౌల్డ్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు.  కుప్పం నియోజకవర్గంలో నియమించిన ఇంచార్జీలు కూడ  కష్టపడి పనిచేయడంతో తమకు మంచి ఫలితాలు వచ్చాయని ఆయన  గుర్తు చేశారు.

 కుప్పంలోని 89 పంచాయితీల్లో 74 చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించినట్టుగా మంత్రి తెలిపారు. 14 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు విజయం సాధించినట్టుగా ఆయన తెలిపారు.