ఆంధ్రప్రదేశ్‌లో పవర్ హాలీడేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక్క రోజు ప‌వ‌ర్ హాలీడేను ఎత్తివేస్తున్న‌ట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గిందని మంత్రి వెల్లడించారు.  

ఏపీలో విద్యుత్ కొర‌త (electricity crisis ) నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌క‌టించిన ప‌వ‌ర్ హాలీడేలపై (power holiday) ప్రతిపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగ‌ళ‌వారం కాస్తంత ఊర‌ట క‌లిగించే నిర్ణ‌యం తీసుకుంది ప్రభుత్వం. ప‌రిశ్ర‌మ‌ల‌కు ఒక్క రోజు ప‌వ‌ర్ హాలీడేను ఎత్తివేస్తున్న‌ట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఆయా కేట‌గిరీల‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్ వినియోగానికి సంబంధించిన ప‌రిమితుల‌ను కూడా స‌డ‌లిస్తున్న‌ట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. 

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం త‌గ్గింద‌న్న పెద్దిరెడ్డి.. ప్ర‌స్తుతం విద్యుత్ వినియోగం 180 మిలియ‌న్ యూనిట్లుగా ఉంద‌ని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం త‌గ్గిన నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌రింతగా విద్యుత్‌ను అందించ‌నున్నామ‌ని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అన్ని ర‌కాల ప‌రిశ్ర‌మ‌ల‌కు 70 శాతం విద్యుత్ వినియోగానికి అనుమ‌తిస్తున్న‌ట్లు చెప్పిన మంత్రి.. ఫుడ్ ప్రాసెసింగ్‌, కోల్డ్ స్టోరేజీల‌కు 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు వెల్లడించారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలతో (power cuts in ap) ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. అవసరాన్ని బట్టి డిస్కమ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట 4 గంటల వరకు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇక, మున్సిపల్‌ ప్రాంతాల్లో రెండు గంటలపాటు విద్యుత్‌ కోత విధిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కరెంట్ కోతలు విధిస్తున్నారు. అయితే ఈ పవర్ కట్స్ చెబుతున్న సమయం కన్నా ఎక్కువగానే ఉంటున్నాయి. గ్రామాలు, పట్టణాల అన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొన్ని సమయాల్లో రాత్రిపూట కూడా కరెంటు కోతలు విధిస్తున్నారు.

రాత్రి, పగలు తేగా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓవైపు.. ఎండ తీవ్రత.. మరోవైపు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండు వేసవిలో సమయం సందర్భం లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాత్రివేళ గంటల తరబడి కరెంటు కట్​ చేయడంతో నరకయాతన అనుభవిస్తున్నామని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో షెడ్యూల్‌ లేని విద్యుత్ కోతల కారణంగా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నగరాల్లో కూడా ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు కూడా కరెంట్ కోతలతో.. పసిపిల్లల తల్లులు విసనకర్రలతో గాలి విసురుతూ కూర్చోవాల్సి వస్తోంది. 

విద్యార్థులు, పరీక్షలకు సన్నద్దమవుతున్న వారు కూడా కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంత నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారు. కరెంట్ కోతలతో చిరువ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ కోతలను వ్యతిరేకిస్తూ రైతులు, ప్రజలు.. విద్యుత్ సబ్ స్టేషన్‌ల ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు విద్యుత్ కోతలపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తున్నాయి. కాల్ చేసి ఫిర్యాదు చేస్తున్న కొందరు.. విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే కోతలు విధించే షెడ్యూల్‌ ప్రకటించాలని అడుగుతున్నారు.