ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి  గౌతమ్‌రెడ్డి(50)  హఠాన్మరణం చెందారు. ఈరోజు ఉదయం గుండెపోటుకు గురయిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంట‌ల ప్రాంతంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. వెంట‌నే వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ఫ‌లితం దక్కలేదు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9:16 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

గౌతమ్ రెడ్డి ఆస్పత్రికి తరలించే ముందు ఏం జరిగిందనే దానిని ఆయన ఇంట్లో పనిచేసేవాళ్లు మాట్లాడుతూ.. ‘దుబాయ్ నుంచి ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఉదయం లేచిన తర్వాత టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేశారు. రాత్రి ఏదో ఫంక్షన్ వెళ్లి వచ్చారు. రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకుని నిద్రపోయారు. ఈ రోజు ఉదయం 7.15 ఇంట్లో సోఫాలో పడిపోయి ఉన్నాడు. వెంటనే బయటకు తీసుకుని వచ్చాం. డ్రైవర్ వెంటనే ఆస్పత్రికి తరలించారు’ అని చెప్పారు.

గత వారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయ‌న ఆరోగ్యం ప‌రంగా కూడా చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే గౌతమ్ రెడ్డి ఇలా హఠాన్మరణం చెందడం పలువురిని షాక్‌కు గురిచేసింది. 

కొద్దిసేపటి కిత్రం గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని.. అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఈరోజు రాత్రికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సొంత జిల్లా నెల్లూరు తరలించనున్నారు. ఎల్లుండి నెల్లూరు జిల్లాలోని సొంతూరు బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.