సారాంశం
మిచౌంగ్ తుఫాన్ కారణంగా కృష్ణా, ఎన్డీఆర్ జిల్లాల రైతులకు ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు . మిల్లుల వద్ద లారీల్లో ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు
మిచౌంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాన్ని వణికించింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై తుఫాన్ ప్రభావం కనిపించింది. లక్షలాది ఎకరాల్లో పంట ముంపునకు గురికాగా.. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రతి అంశంపై మానిటరింగ్ చేస్తున్నారని, నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ కారణంగా కృష్ణా, ఎన్డీఆర్ జిల్లాల రైతులకు ఎక్కువ నష్టం జరిగిందని, ఈ ప్రాంతంలో డ్రయ్యర్ మిల్లులు ఎక్కువగా లేనందున ఇక్కడి ధాన్యాన్ని పల్నాడు, బాపట్ల , ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తరలిస్తున్నామని కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారని.. పౌర సరఫరాల శాఖ తరపున రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కారుమూరి చెప్పారు.
ALso Read: Cyclone Michaung: బాపట్లపై విరుచుకుపడుతున్న మిచౌంగ్ తుఫాను.. ఏపీలో భారీ వర్షాలు
రైతులకు సబ్సిడీ అందించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుందని.. మిల్లుల వద్ద లారీల్లో ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 6 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకున్నామని.. 1300 కోట్ల రూపాయలకు గాను 1070 కోట్లు చెల్లించామని కారుమూరి తెలిపారు. అంతేకాకుండా ఆఫ్‌లైన్‌లో 1,10,000 టన్నుల ధాన్యాన్ని తీసుకున్నామని.. కార్డు లేని కౌలు రైతుల ధాన్యాన్ని సొసైటీ ద్వారా కొంటామని నాగేశ్వరరావు వెల్లడించారు. ఇతర జిల్లాలకు తరలించే ధాన్యానికి సంబంధించి రైతులపై రవాణా ఖర్చుల భారం పడకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.