శ్రీకాకుళం: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. వైసీపీ అసలు పార్టీనే కాదని అదొక సర్కస్ కంపెనీ అంటూ ధ్వజమెత్తారు. జగన్ ఏ ఊరు వెళ్తే అక్కడ విన్యాసాలు చేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

300 రోజులు పాదయాత్ర చేసిన జగన్, 5 ఎకరాల స్థలంలో ఎక్కడైనా బహిరంగ సభ పెట్టారా? అని నిలదీశారు. తెల్లవారితే చాలు జగన్‌కు చంద్రబాబు సింహంలా కనపడుతున్నారని వ్యాఖ్యానించారు. పక్క జిల్లాలో ఉండి కూడా తిత్లీ బాధితులను పరామర్శించలేని అజ్ఞాని అంటూ మండిపడ్డారు.
 
వైఎస్ జగన్‌లాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని కళా వెంకట్రావ్ విమర్శించారు. జగన్ వ్యవహార శైలిని తెలుగు ప్రజలు అసహ్యసించుకుంటున్నారని చెప్పారు. జగన్‌ది నేర చరిత్ర కలిగిన కుటుంబం అని వివరించారు. 16 ఏళ్ల వయసులోనే ఎర్రగడ్డ సూటుకేసు బాంబు కేసులో ముద్దాయి అంటూ ఆరోపించారు. 

ఆ బాంబు కేసులో జగన్‌ను తప్పించటానికి ఆయన తండ్రి వైఎస్ ఎవరి దగ్గర ప్రాధేయపడ్డాడో తెలుసుకోవాలని సూచించారు. జగన్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. తోటపల్లి ప్రాజెక్ట్ టీడీపీ హయాంలోనే డీపీఆర్ చేయించి రూ.37 కోట్లు మంజూరు చేశామని మంత్రి కళా స్పష్టం చేశారు.