ప్రభుత్వ భూములను తనఖా పెట్టి బ్యాంకులో అప్పు తీసుకున్న విషయం గంటాకు తెలీకుండానే జరిగిందని ఎవరూ అనుకోవటం లేదు.
బ్యాంకు అప్పులను ఎగ్గొట్టటంలో కేంద్రమంత్రి సుజానాచౌదరిని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ రావు ఆదర్శంగా తీసుకున్నట్లు కనబడుతోంది. బ్యాంకుల నుండి తీసుకున్న అప్పు ఎగొట్టినా రాజ్యసభ సభ్యత్వం, ఆపైన కేంద్రమంత్రి పదవి సుజనాకు దక్కింది. సుజనాకే ఏమీ కానపుడు తనకు మాత్రం ఏమవుతుందని అనుకున్నారో ఏమో గంటా కూడా బ్యాంకులను ఖాతరు చేయలేదు.
తోడల్లుడు, దగ్గరి వారితో కలిసి ఎగ్గొట్టిన బ్యాంకు అప్పు చివరకు గంటా మెడకే చుట్టుకోవటం విశేషం. ఆ విషయమే ఇపుడు రాష్ట్రంలో సర్వత్రా చర్చకు దారితీసింది. ఇండియన్ బ్యాంకుకు గంటా బృందం ఎగొట్టిన అప్పు వ్యవహారం ముదురుతోంది.
ఎందుకంటే, ప్రత్యూషా కంపెనీ తీసుకున్న అప్పును ఎగ్గొట్టటం మంత్రి గంటాకు తెలీకుండా జరగదు. ఆనందపురం మండలంలోని ప్రభుత్వ భూములను తమవిగా చూపించి మరీ గంటా తోడల్లుడు పరుచూరి వెంకటభాస్కర రావు బ్యాంకుకు ఇవ్వటమంటే మామూలు విషయం కాదు.
ప్రభుత్వ భూములను తనఖా పెట్టి బ్యాంకులో అప్పు తీసుకున్న విషయం గంటాకు తెలీకుండానే జరిగిందని ఎవరూ అనుకోవటం లేదు. మండలంలోని వేములవలస గ్రామంలోని సర్వేనెంబర్ 122/9లో 0.23 ఎకరాలు, 122-11లో 726 గజాలు, 122/9, 10-15 వరకూ ఉన్న సర్వే నెంబర్లలోని కొంత భూమిని బ్యాంకులో తనఖా పెట్టారు.
ఇక్కడే అసలు ట్విస్టుంది. ఏమిటంటే, సదరు సర్వే నెంబర్లలోని భూములు ప్రభుత్వ వెబ్ సైట్ ప్రకారం ప్రభుత్వ భూములు. అంటే తప్పుడు రికార్డులు సృష్టించి బ్యాంకుల్లో తమవిగా చూపించుకుని రుణాలు పొందారు. ఎప్పుడైతే బ్యాంకు నోటీసుల ద్వారా విషయం వెలుగు చూసిందో వెంటనే జిల్లా కలెక్టర్ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తున్నారు.
గంటా అంటే మిగిలిన మంత్రుల్లాగ మామూలు మంత్రి కాదు. చంద్రబాబుకు ఎంతో దగ్గరివాడైన మంత్రి నారాయణకు స్వయానా వియ్యంకుడు. మరి, కలెక్టర్ విచారణలో ఏమి తేలుతుందో చూడాల్సిందే. గంటా వ్యవహారం చంద్రబాబు దృష్టికి కూడా చేరిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
