ఏపీలో ప్రారంభమైన ‘‘ఫస్ట్ డే ఫస్ట్ షో’’.. దేశంలో ఎక్కడా ఇలాంటి కాన్సెప్ట్ లేదు : గుడివాడ అమర్‌నాథ్
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫస్ట్ డే ఫస్ట్ షో విధానాన్ని ఏపీ ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ శుక్రవారం ప్రారంభించారు. తద్వారా థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూడవచ్చు.
సినిమా విడుదలైన రోజు థియేటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఫస్ట్ డే , ఫస్ట్ షో విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ‘‘ఫస్ట్ డే ఫస్ట్ షో’’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ‘నిరీక్షణ’ సినిమాను మంత్రి విడుదల చేశారు. అనంతరం గుడివాడ మాట్లాడుతూ.. దేశంలో ఈ తరహా కాన్సెప్ట్ ఎక్కడా లేదన్నారు. సినిమా రిలీజ్ రోజునే ఇంటిల్లిపాది ఇంటి వద్దే సినిమా చూడొచ్చని ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ద్వారా గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు లబ్ధి కలుగుతుందన్నారు. సినీ పరిశ్రమలో 80 శాతం సినిమాలు థియేటర్‌లో విడుదలకు నోచుకోవడం లేదని.. కానీ తాము తీసుకొచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం చిన్న తరహా నిర్మాతలకు మేలు చేకూరుస్తుందని గుడివాడ అమర్‌నాథ్ ప్రకటించారు.
కాగా.. రూ.79 రీచార్జ్‌తో ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఫస్ట్ డే ఫస్ట్ షో విధానాన్ని పొందవచ్చు. ఈ మేరకు రెవెన్యూ షేరింగ్ విధానంలో ఫైబర్ నెట్, మూవీ మేకర్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్‌లో ఏడు లక్షల కనెక్షన్లు వున్నాయి. అందులో దాదాపు ఐదు లక్షల మంది చూసినా కోట్లలో ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్లాన్‌కు 24 గంటల వ్యాలిడిటీ వుంటుంది. తద్వారా థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూడవచ్చు.