కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం అమ్మఒడి. నిరక్షరాస్యత తగ్గించడంతోపాటు విద్యను ప్రాథమిక హక్కుగా తెలియజేసేందుకు అమ్మఒడి పథకం రూపొందించారు సీఎం జగన్. 

నవరత్నాల్లో కీలక పథకమైన అమ్మఒడి విధి విధానాలపై కీలక ప్రకటన చేశారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమ్మఒడి పథకం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకే వర్తింప చేస్తామని తేల్చి చెప్పారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి, విద్యార్థినుల తల్లికి జనవరి 26న రూ.15వేలు అందజేయనున్నట్లు తెలిపారు. అయితే ప్రైవేట్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అందజేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు గుమ్మనూరు జయరామం కూడా జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.