అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. రిజర్వేషన్ల విషయంలో కాపులను దారుణంగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

కాపులను ఏలా వంచించారో చంద్రబాబుకు కూడా తెలుసునన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దాని గురించి మాట్లాడకుండా 2004లో కాంగ్రెస్ పార్టీ హామీ అంటూ చెప్తారని ఇలా చెప్పుకుంటూ రాజకీయం చేసుకుంటూ పోతారా అంటూ నిప్పులు చెరిగారు. 

కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్ల 5శాతం కాపులకు రిజర్వేషన్ ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు నాయుడు దానికి ఎలాంటి చట్టబద్ధత ఉందా అని నిలదీశారు. ఏ తలపెట్టుకుని కాపుల గురించి మాట్టాడుతున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 

తాము దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసులమేనని చెప్పుకొచ్చారు. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి వారసులమని అదే బాటలో వైయస్ జగన్ ప్రభుత్వం పయనిస్తోందని చెప్పుకొచ్చారు. అంతేకానీ చంద్రబాబులా మాయమాటలు, అబద్దాలు చెప్పే వ్యక్తులం కాదన్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత అన్ని రంగాలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సీనియర్ నేతగా ఒక హుందాగా నడుచుకోవాలని లేనిపక్షంలో ప్రజలు చీత్కరించుకునే పరిస్థితికి దిగజారొద్దని బొత్స సత్యనారాయణ సూచించారు.