విజయనగరం: ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ ఆదివారం నాడు కన్నుమూశారు. ఆమె వయస్సు 84 ఏళ్లు. నెల రోజులుగా
 ఆమె అనారోగ్యంతో ఉన్నారు. దీంతో ఆమె విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఇవాళ మరణించారు. ఈశ్వరమ్మకు 11 మంది సంతానం. వీరిలో ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. వీరిలో అందరి కంటే పెద్దవాడు బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ తర్వాతి వాడు బొత్స అప్పల నరసయ్య. అప్పల నరసయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు.

బొత్స సత్యనారాయణ మాతృమూర్తి మరణించడంతో పలువురు ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు సంతాపం తెలిపారు.  విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయన బొత్స ఈశ్వరమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఈశ్వరమ్మ మరణించడంతో మంత్రి బొత్స సత్యనారాయణ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొన్నారు.  ఇవాళే ఈశ్వరమ్మ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు.

బొత్స సత్యనారాయణకు పలువురు మంత్రులు, వైసీపీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు ఈశ్వరమ్మ మృతికి సంతాపం తెలిపారు. అంత్యక్రియల్లో పలువురు పార్టీ నేతలు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం