మూడు రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
మూడు రాజధానులపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగాది నుండి విశాఖ నుండి పాలన సాగించాలని జగన్ పై ఒత్తిడి తెచ్చామన్నారు.
అమరావతి: ఉగాది నుండే విశాఖ నుండి పాలన చేయాలని సీఎం జగన్ పై ఒత్తిడి తెస్తున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తమ వినతికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. 2014లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోన టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. అసెంబ్లీలో మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రకటించారు
.ఈ విషయమై అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించి నివేదిక అందించింది. వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యమని వైసీపీ సర్కార్ భావిస్తుంది. అభివృద్ది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే ఉద్యమాలకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని జగన్ సర్కార్ అభిప్రాయంతో ఉంది. దీంతో విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి జేఏసీతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిసన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.
also read:సన్నాసి మాటలు, ఆవేశపడితే భయపడం: పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స ఫైర్
వీలైనంత త్వరగా విశాఖపట్టణం నుండి పాలన సాగించాలని జగన్ సర్కార్ భావిస్తుంది. అయితే న్యాయపరమైన ఇబ్బందులు తొలగిన తర్వాత విశాఖ నుండి పాలన సాగించాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. మూడు రాజధానులపై ప్రభుత్వంపై తీసుకు వచ్చిన బిల్లును వెనక్కి తీసుకుంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా బిల్లును తీసుకు రావాలని జగన్ సర్కార్ భావిస్తుంది. వీలైతే వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం లేకపోలేదు.