జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు.
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.గురువరం నాడు తాడేపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు. ఎవరిని కొడతాడు , ఎవరిని బెదిరిస్తాడని పవన్ కళ్యాణ్ ను మంత్రి ప్రశ్నించారు. నువ్వు ఆవేశపడితే ఎవరూ కూడా భయపడరని మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.
ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. రిపబ్లిక్ డే రోజున హుందాగా మాట్లాడుతారన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇష్టారీతిలో మాట్లాడుతున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ కి కేఏ పాల్ కు తేడా ఏముందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
సన్నాసి మాటలు మాట్లాడి తమ చేత కూడా అవే మాటలను పవన్ కళ్యాణ్ మాట్లాడిస్తున్నాడని మంత్రి విమర్శించారు. పవన్ ను చూస్తుంటే రాజకీయాలపై విరక్తి కలుగుతుందన్నారు. పవన్ కి సబ్జెక్టు లేదన్నారు. జనసేనకు ఓ విధానం లేదని మంత్రి విమర్శించారు.
మూడు రాజధానులే తమ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కానీ తమది మూడు రాష్ట్రాల విధానం కాదన్నారు. 26 జిల్లాల అభివృద్ధి , ఐదు కోట్ల ప్రజల సంక్షేమమం తమ విధానమని మంత్రి తెలిపారు. సెలబ్రిటీ పార్టీ నేత ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రాన్ని జగన్ అభివృద్ధి చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ పడుతున్నాడో చెప్పాలన్నారు.
also read:ఏపీని విడగొడతామంటే తోలు తీసి కూర్చోబెడతాం.. ప్రజలు విసిగిపోయారు: పవన్ కల్యాణ్
రాజకీయాలంటే రెచ్చగొట్టడం కాదని మంత్రి చెప్పారు. యువతకు పవన్ కళ్యాణ్ ఏం చెప్పదల్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. తన బస్సు యాత్రను దమ్ముంటే ఆపాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. నీ బస్సు యాత్రను ఎవరు ఆపుతారు, ఎవరు అడ్డుకుంటారని మంత్రి ప్రశ్నించారు. తాము అడ్డుకుంటామని చెప్పామా అని మంత్రి పవన్ కళ్యాణ్ ని అడిగారు.
