విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వమని స్పష్టం చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. గత ప్రభుత్వాల మాదిరిగా మాయమాటలు చెప్పే ప్రభుత్వం తమది కాదని స్పష్టం చేశారు. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం తమది అని చెప్పుకొచ్చారు.

తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతమైన నేత అని కొనియాడారు. రాజన్న రాజ్యం తీసుకురావాలన్నదే ఆయన లక్ష్యమని ఆ దిశగా అందరం పని చేస్తున్నట్లు తెలిపారు. 

విశాఖపట్నంలో వైఎస్ఆర్ పెన్షన్ పథకాన్ని మంత్రులు బొత్స సత్యానారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్ లను అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందజేస్తామని స్పష్టం చేశారు. 

విశాఖపట్నం వాసులకు మరిన్ని సౌకర్యాలు అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ సెంట్రల్ పార్క్ ను వైయస్ఆర్ సెంట్రల్ పార్క్ గా ప్రభుత్వం మార్చినట్లు చెప్పుకొచ్చారు. సెంట్రల్ పార్క్ వద్ద వైయస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 2న విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు.