ఏపీ జెన్‌కో ఉద్యోగులకు మంత్రి బాలినేని ఆహ్వానం: ఆందోళనలకు తాత్కాలిక బ్రేక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జెన్ కో ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. దీంతో జెన్ కో ఉద్యోగులు తమ ఆందోళనలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని Genco ఉద్యోగులు తమ ఆందోళన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం జెన్ కో ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించింది.
ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం నుండి హామీ వచ్చింది. దీంతో ఆందోళనలకు తాత్కాలికంగా వాయిదా వేయాలని జేఎసీ నిర్ణయం తీసుకొంది. కృష్ణపట్నం విద్యుదుత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణపై యథాతథంగా ఆందోళన కొనసాగుతోంది. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై చర్చలకు రావాలని ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి Balineni Srinivas Reddy ఆహ్వానించారు.
తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ జెన్ కో ఉద్యోగులు ఇవాళ్టి నుండి సహాయ నిరాకరణ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఇంధనశాఖ సెక్రటరీకి లేఖ కూడా రాశారు. జనవరి మాసం వేతనాలు చెల్లించడంతో పాటు ఇతరత్రా డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తామని ప్రకటించారు. అయితే జెన్ కో ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్లు సాధన కోసం సహాయ నిరాకరణను పిలుపునిచ్చారు.
అయితే ఉద్యోగులకు జనవరి నెల వేతనం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో వైపు చర్చలకు రావాలని కూడా ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జెన్ కో ఉద్యోగులను ఆహ్వానించారు. మంత్రితో చర్చలకు జెన్ కో ఉద్యోగుల జెఎసీ నేతలు వెళ్లనున్నారు.