నర్సీపట్నం: ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం సీఎంను బెదిరించడం ప్రతీ ఒక్కడికీ అలవాటై పోయిందని వ్యాఖ్యానించారు. 

నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడిన అయ్యన్న కొంతమంది నాయకుల బెదిరింపులకు చంద్రబాబు విసుగుచెందారని అందువల్లే పార్టీ వీడుతున్న వారి గురించి పట్టించుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 

గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తోందని ఆ అభివృద్ధే తమను గెలిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖ జిల్లా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ జిల్లా అంటే అందరికీ లోకువ అయిపోయిందంటూ మండిపడ్డారు. 

కొంతమంది ఎన్నికలకు 14 రోజులు ముందు సూటుకేసులతో వచ్చి నామినేషన్లు వేసి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు చేజిక్కించుకొంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లా రాజకీయాల్లో స్థానికేతరుల ప్రాబల్యం అధికమవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ రాజకీయ అవకాశవాది అంటూ విరుచుకుపడ్డారు. మంత్రి పదవి కోసం రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని కాదని వైసీపీలో చేరారని ఆరోపించారు. కాపులకు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందనేది అందరికీ తెలిసునని పదవుల కోసం పార్టీ మారినప్పుడు తప్పుడు ఆరోపణలు చెయ్యడం నాయకత్వ లక్షణం కాదన్నారు. 

రాజకీయాల్లో హద్దులు, నైతిక విలువలు ఉంటాయని వాటికి నాయకులు వాటికి కట్టుబడి ఉండాలని హితవు పలికారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ప్రతిరోజూ ఉదయాన్నే చెక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈసారి రాష్ట్రంలో పార్టీల సంఖ్య పెరగడంతో ఆప్షన్లు పెరిగి డిమాండ్లు మొదలయ్యాయంటూ మంత్రి అయ్యన్న వ్యాఖ్యానించారు.