ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన కుమారుడికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో కుమారుడితో పాటు అవంతి హోం క్వారంటైన్ లో ఉన్నారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. అవంతితో పాటు ఆనయ కుమారుడు వెంకట శివసాయి సందీప్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
అవంతి శ్రీనివాస్, ఆయన కుమారుడు హోం క్వారంటైన్ కు వెళ్లినట్లు ఆ ప్రకటనలో వెళ్లినట్లు, వారు చికిత్స పొందుతున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. సందర్శకులు ఎవరు కూడా తనను కలిసేందుకు కార్యాలయానికి రావద్దని అవంతి శ్రీనివాస్ కోరారు. కార్యాలయ సిబ్బంది ఫోన్ లో అందుబాటులో ఉంటారని, ఏ సమస్య వచ్చినా కూడా వారిని సంప్రదించాలని మంత్రి సూచించారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్లమెంటు సభ్యులు ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఎంపీ రెడ్డప్పకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఐసోలేషన్ లో ఉండాలని ఆయనకు సూచించారు
అరకు ఎంపీ మాధవికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో రెండు వారాల పాటు ఆమె ఢిల్లీలోనే చికిత్స తీసుకుంటారు
కాకినాడ ఎంపీ వంగ గీతకు ఇదివరకే కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారంనాడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి.