విజయవాడ: అయ్యప్ప దీక్షలో ఉన్న మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పులు వేసుకోవడంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. అయ్యప్పమాలలో ఉంటూ చెప్పులు వేసుకోవడం హైందవ ధర్మానికి విరుద్ధమంటూ కొందరు అధ్యాత్మికవేత్తలు సైతం తప్పుబడుతున్నారు. 

అయ్యప్పమాల వేసుకుని చెప్పులుతో నడుస్తున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపట్ల స్పందించారు మంత్రి అవంతి శ్రీనివాస్.అనారోగ్య కారణాల వల్లే తాను చెప్పులు వేసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. 

టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా తాను అయ్యప్ప మాల ధరించానని గుర్తు చేశారు. ఆనాడు కూడా తాను చెప్పులు వేసుకున్నానని స్పష్టం చేశారు. టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ సైతం అయ్యప్పమాలలో ఉండగా ఆయన కూడా చెప్పులు వేసుకున్నారని ఆరోపించారు.

మురళీమోహన్ అయ్యప్పమాలలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. మతాన్ని కూడా చంద్రబాబు రాజకీయం  చేస్తున్నారంటూ విమర్శించారు.  

మతాన్ని రాజకీయంగా వాడుకుంటూ తనపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు మాలలో పవిత్రంగా ఉన్న తాను వైసీపీలోకి వెళ్లిన తర్వాత అపవిత్రుడినయ్యానా అంటూ నిలదీశారు. 

తన కంటే అమితంగా హిందూ మతాన్ని ప్రేమించే వాళ్లు ఎవరూ లేరని మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. హిందూ మతంలోనే పుట్టాను, హిందూ మతంలోనే చనిపోతాను అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. 

ఇకపోతే అయ్యప్పమాలలో ఉంటూ ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్ లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ వైబీ రాజేంద్రప్రసాద్ ను బండబూతులు తిట్టిన సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్పమాలలో ఉంటూ బూతులు తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలలో ఉంటూ చెప్పులు వేసుకుంటారా అంటూ నిలదీశారు. 

అటు మాజీమంత్రి దేవినేని ఉహా మహేశ్వరరరావు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ తిట్ల పురాణం, అవంతి శ్రీనివాస్ చెప్పులు వేసుకోవడం ఇదంతా హిందుత్వంపై దాడేనంటూ దేవినేని ఉమా అభిప్రాయపడ్డారు. 

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి ఘాటుగా స్పందించారు. ఇంగ్లీషు మీడియం అంశంపై రాద్ధాంతం చేయడం ఆయనకు తగదని హెచ్చరించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌, మనవడు దేవాన్ష్‌ ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు గానీ పేద పిల్లలు ఇంగ్లీషులో చదవకూడదా అంటూ నిలదీశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అయప్ప మాలలో ఉండి కూడా వంశీ, అవంతీ చెప్పులేసుకుంటారు:వర్ల

అయ్యప్ప మాలలో వంశీ తిట్లు.. హిందూ మతంపై జగన్ దాడే: దేవినేని ఉమ